Skip to main content
Latest News

నేను చేసిన తప్పుకు.. నాకు ఇదే శిక్ష.. అంటూ లేఖ రాసి బీటెక్ విద్యార్థిని..

‘సారీ మా..సారీ డాడీ.. నాకు వేరే మార్గం కనిపించలేదు.. నేను తప్పు చేస్తున్నా అని తెలుసు.. బట్‌ నన్ను మీరైనా అర్థం చేసుకోండి.. నేను ఇలా చేసుకున్నందుకు ఎవరూ కారణం కాదు.. బబ్లూ.. మంచిగా చదువుకొని అమ్మవాళ్లను బాగా చూసుకో.. అమ్మమాట విను. నేను చేసిన దానికి నాకు ఇదే పనిష్‌మెంట్‌.. నన్ను అందరూ బాగా చూసుకున్నారు.. నామీద పెట్టుకున్న హోప్స్‌ని నిలబెట్టుకోలేక పోతున్నందుకు బాధపడకండి’.. అంటూ ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని లేఖ రాసి పెట్టి  హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివీ..

వైఎస్సార్‌ జిల్లా కడప పట్టణం అక్కాయపల్లెకు చెందిన పసుపులేటి సంజీవరాయుడు, కృష్ణవేణి దంపతులకు ఇరువురు సంతానం. వీరిలో పెద్దమ్మాయి భవ్య(19) అంగళ్లు సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల సమీపంలోని ఒక మహిళా ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం కూడా హాస్టల్‌ నుంచి కళాశాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. కొంత సేపటికే తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. పరీక్ష కూడా రాయలేదని చెబుతున్నారు. హాస్టల్‌ గది నుంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్‌ నిర్వాహకులు చూశారు. పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో చూశారు. సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీఆర్వో అంజికుమార్‌ సమక్షంలో గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఘటన స్థలంలో ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంది. తల్లి కృష్ణవేణి మధ్యాహ్నం అంగళ్లుకు చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి.. ఎందుకిలా చేశావమ్మా..? అంటూ బోరున విలపించారు. ఈమె తండ్రి సంజీవరాయుడు విజయవాడలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె రాసిన సుసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలను అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu