Skip to main content
Latest News

భర్త ఆర్మీ ఉద్యోగి.. వేరొకరితో భార్య అఫైర్.. మద్యంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి..

వివాహేతర సంబంధం ఒక ఆర్మీ ఉద్యోగి హత్యకు కారణమైంది. భార్యే భర్తను దగ్గరుండి మరీ చంపేలా చేసింది. ఎట్టకేలకు విశాఖ నగర పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను విశాఖ సీపీ ఆర్‌కె.మీనా నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన దల్లి సతీష్‌కుమార్‌ నేవీ ఉద్యోగి. ఇతనికి 2010లో నగరానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి కృష్ణ ప్రవీణ్‌ (8), కృష్ణ లిథిక్‌ (3) పేర్లతో పిల్లలున్నారు. భర్త సతీష్‌ కుమార్‌ ఉద్యోగం రీత్యా భార్యకు దూరంగా ఉండేవాడు. ఈ వ్యవధిలో జ్యోతికి జైలు రోడ్డుకు చెందిన యువకుడు సిమ్మా భరత్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని గమనించి అత్త దల్లి పార్వతి పలుమార్లు జ్యోతిని మందలించింది. అయినా ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పూ రాలేదు. 

జులై 27న సతీష్‌కుమార్‌ సెలవుపై నగరానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కుమారునితో తల్లి పార్వతి... జ్యోతి, భరత్‌కుమార్‌ల విషయాన్ని చెప్పింది. సతీష్‌కుమార్‌ మూడు వారాలు ఓపికి పట్టి ఒక రోజు జ్యోతిని నిలదీశాడు. అప్పటికప్పుడు ఏదో చెప్పి తప్పించుకున్న జ్యోతి భర్తతో గొడవ పడిన విషయాన్ని భరత్‌కుమార్‌కు చెప్పింది. ఇలా అయితే కష్టమేనని, ఎలాగైనా సతీష్‌కుమార్‌ను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు ప్లాన్‌ వేశారు. సతీష్‌కుమార్‌ ఇంటి వద్ద మద్యం సేవించినప్పుడు అందులో మత్తు మాత్రలు వేసి చంపేయాలని అనుకున్నారు. పథకం ప్రకారం ఆగస్టు 18 రాత్రి 8 గంటల సమయంలో జ్యోతి రెండు నిద్ర మాత్రలను పొచిచేసి సతీష్‌ కుమార్‌ తాగే విస్కీలో కలిపి ఇచ్చేసింది. అది తాగిన సతీష్‌కుమార్‌ నిద్రలోకి జారుకోగానే జ్యోతి వెంటనే ప్రియుడు భరత్‌కుమార్‌కు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించింది. 

భరత్‌ రాత్రి ఒంటి గంట సమయంలో తన స్నేహితుడు గొడ్ల భాస్కరరావును తీసుకుని జ్యోతి ఇంటికి వచ్చాడు. అప్పటికే మంచంపై పడి ఉన్న సతీష్‌కుమార్‌ మెడలో చున్నీ వేసి భరత్‌, భాస్కరరావులు చెరో వైపు లాగి బిగించడంతో సతీష్‌కుమార్‌ మృతి చెందాడు. అతని చేతికి ఉన్న రెండు ఉంగరాలను జ్యోతి తీసి భరత్‌, భాస్కరరావులను అక్కడి నుంచి పంపించేసింది. అనంతరం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సతీష్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని అత్తమామలకు, తల్లిదండ్రులకు ఉదయం నాలుగు గంటలకు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ క్రమంలో పోలీసులకు ఫోన్ చేసిన జ్యోతి తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. సతీశ్ కుటుంబ సభ్యులు కూడా జ్యోతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు జరిపేశారు. 

తాజాగా,  జ్యోతి సైనికాధికారులను కలిసి తన భర్తకు రావాల్సిన నగదు మొత్తాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆర్మీ అధికారులు పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులను సంప్రదించడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఇది ఆత్మహత్య కేసులా లేదంటూ.. ఆర్మీ అధికారులు అసలు విషయం తేల్చాలంటూ పోలీసులకు సూచించారు. వారు జ్యోతిని మరోమారు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులైన భరత్‌, భాస్కరరావు, జ్యోతిలను మంగళవారం మద్దిలపాలెం ప్రాంతంలో అరెస్టు చేశారు. సమావేశంలో ఎసిపిలు, సిఐలు పాల్గొన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu