Skip to main content
Latest News

అభిమానిని ఇంటికి పిలిపించుకుని.. చిరంజీవి ఏం చేశారంటే..

చిరంజీవి ఫ్లెక్సీని పెళ్లి మండపంలో కట్టించి.. దాంట్లో ఉన్న మెగాస్టార్ సాక్షిగా చాలా కాలం క్రిందట పెళ్లి చేసుకున్న ఓ మెగా అభిమాని గురించిన వార్త అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ విషయం చిరంజీవికి తెలిసింది.. వెంటనే ఆ కొత్త జంటను ఇంటికి రప్పించుకుని వారికి పట్టుబట్టలు పెట్టి చిరంజీవి ఆశీర్వదించారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మరో మెగా ఫ్యాన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన కొడుకుకు చిరంజీవి చేతులమీదుగానే నామకరణం జరగాలని పట్టుబట్టి కూర్చున్నాడా అభిమాని. ఎవరెంత చెప్పినా వినకుండా కొంతకాలంగా వేయి కళ్లతో వేచి చూస్తున్నాడు సదరు వ్యక్తి. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకూ వెళ్లడంతో..  అతన్ని ఇంటికి పిలిపించుకొని అతని కుమారుడికి పవన్ శంకర్ అనే నామకరణం చేశారు మెగాస్టార్.. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నక్కా వెంకటేశ్వరరావు చిరంజీవికి వీరాభిమాని.. చిరంజీవి సినిమా విడుదలయిందంటే చాలు మొదటిరోజు మొదటి షో చూడాల్సిందే. చిరంజీవి పేరు మీద చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. ఆ తర్వాత ఫలితాలు వచ్చాక.. అతడిని అయిదేళ్ల పాటు ఆ గ్రామం నుంచి వెలేశారు.. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన ఇంటికి పిలిపించికొని రోజంతా ఆశ్రయమిచ్చి.. కుశల ప్రశ్నలు అడిగారు.. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులందరికీ బట్టలు పెట్టి పంపించారు. కాగా గతేడాది ఏప్రిల్ నెలలో వెంకటేశ్వర రావుకు ఓ బాబు పుట్టాడు. అయితే అతనికి మెగాస్టారే నామకరణం చేయాలని పట్టుబట్టుక్కూర్చున్నాడా వ్యక్తి.. ఎన్ని రోజులైనా చిరంజీవి గారి కోసం వేచి ఉంటానంటూ అతను పట్టుబట్టాడు. ఈ విషయం చిరంజీవికి తెలియడంతో.. వెంకటేశ్వరరావుకు స్వయంగా ఫోన్ చేసి కుటుంబంతో కలిసి ఇంటికి రమ్మని చెప్పారు. దీంతో సోమవారం (22-04-2019) చిరంజీవి ఇంటికి వెళ్లి.. కుమారుడికి నామకరణం చేయించాడు. పవన్ కల్యాణ్ పేరులో నుంచి ‘పవన్’ను.. చిరంజీవి పేరైన శివశంకర వరప్రసాద్‌లో నుంచి ‘శంకర్’ను తీసుకుని ‘పవన్ శంకర్’ అనే పేరును చిరంజీవి పెట్టారు. దీంతో ఆ అభిమాని పండగ చేసుకుంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి..