Skip to main content
Latest News

వన్డే టూర్ లో చంద్రబాబు సిక్సర్లు

ముఖ్యమంత్రి సింగపూర్ లో ఒక్క రోజే ఉన్నా..ఆయన కోసం దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఎదురు చూశారు. టాటా సన్స్ చైర్మన్ అయితే… త్వరలో తన టీమ్ తో అమరావతి వస్తానని.. అడగక ముందే చెప్పేశారు. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. అమరావతిలో విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్ల వంటి ఆధునిక రవాణా వ్యవస్థలో టాటా సంస్థ భాగస్వామ్యం కానుంది. హోటళ్లు, స్మార్ట్‌ సిటీలు, రవాణారంగం తదితర అంశాలపై ఆయా విభాగాధిపతులను చంద్రశేఖరన్ తీసుకురానున్నారు. అంటే బ్రాండ్ టాటా కేరాఫ్ ఎపీ అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.

బ్రిటన్ మాజీ ప్రధాని, ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ సంస్థ నిర్వాహకుడు టోనీ బ్లెయిర్‌ చంద్రబాబును ప్రత్యేకంగా వచ్చి కలిశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో తన పర్యటనను బ్లెయిర్ గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రం గురించి వివరాలు తెలుసుకున్నారు. రాజధానికి సంబంధించిన విశేషాలన్నింటినీ బ్లెయిర్ కు చంద్రబాబు వివరించారు

గతంలో భారతదేశం వెళ్లినప్పుడు ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తనకు చెప్పిన సంగతిని టోనీ బ్లెయిర్ గుర్తుచేసుకున్నారు. క్లింటన్ చెప్పినందునే అప్పుడు ఏపీకి వచ్చానన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాలన వ్యవస్థలో అమలు చేసే ఉత్తమ విధానాలపై బ్లెయిర్‌ నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థ పరిశోధనలు చేస్తోంది. వీటిపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆహ్వానించారు. ముందుగా తమ బృందాన్ని పంపించి తరువాత తాను వస్తానని టోనీ బ్లెయిర్‌ చంద్రబాబుకు తెలిపారు.

చంద్రబాబుతో సింగపూర్ ప్రభుత్వ రాయబారి గోపీనాథ్ పిళ్లై కూడా సమావేశం అయ్యారు. జులై, నవంబరులో జరిగే రెండు అతి ముఖ్య సమావేశాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. నవంబరులో జరిగే సౌత్ ఏషియా డయాస్ఫోరా మీట్ కు తప్పనిసరిగా రావాలని కోరారు. మొత్తానికి.. రెండు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు.. తన సామర్థ్యం ఏమిటో.. సింపుల్ గా చూపించేశారు. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తల్ని ఏపీకి ఆకర్షించారు.