Latest News

వైసీపీలో మరో విజయసాయి

వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. జగన్ అక్రమాస్తులు కూడబెట్టడంతో ఆయనకు సలహాలు ఇచ్చిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి… జగన్ తో పాటే జైలుకు కూడా వెళ్లారు. జగన్ అక్రమాస్తుల గుట్టు అంతా విజయసాయికి తెలుసు అని… అందుకే ఆయనకు జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది. అయితే విజయసాయి జగన్ కోసం ఎంతో చేశారని… అందుకే ఆయనకు ఈ పదవి దక్కిందని వైసీపీ నేతలు చెబుతుంటారు.

తన కోసం జైలుకు వెళ్లాడనే కారణంగానే విజయసాయికి జగన్ ఎంపీ సీటు ఇచ్చాడని వైసీపీ నేతలు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. వారి మాటల్లో నిజం ఎంతనే విషయం పక్కనపెడితే…తాజాగా వైసీపీలో మరో విజయసాయిరెడ్డి పుట్టుకురాబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. వైఎస్ హయాంలో మైనింగ్ శాఖలో కీలక అధికారిగా వెలిగిన వి.డి.రాజగోపాల్… అక్రమాస్తులు కూడగట్టుకునే విషయంలో జగన్ కు సహకరించారనే ప్రచారం ఉంది. ఈ కేసులో ఆయన కొన్ని నెలల పాటు జైలుకు కూడా వెళ్లారు. అలాంటి వి.డి.రాజగోపాల్ త్వరలోనే వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కర్నూలు ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నిలవబోయేది ఆయనే అని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వాల్మీకి బోయలకు ఎంపీగా అవకాశం ఇస్తానని జగన్ చేసిన ప్రకటనకు కూడా అసలు కారణం ఇదేనని… రాజగోపాల్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ ప్రకటన చేశారని కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తాను కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు రాజగోపాల్ తన సన్నిహితులకు చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్నూలు ఎంపీ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాల్మీకి బోయ సామాజికవర్గానికి చెందిన రామయ్యకు జగన్ దాదాపుగా హ్యాండ్ ఇచ్చినట్టే అనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. మొత్తానికి తనతో పాటు జైలుకు వెళ్లొచ్చిన నాయకులందరికీ వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించాలని జగన్ గట్టిగానే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.