Skip to main content
Latest News

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట!

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట!

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట!

రామాపురంలో జంగయ్య  అని ఒక రైతు ఉండేవాడు. మంచి భూస్వామి. మెట్ట, మాగాణి రెండిట్లోనూ పంట కూడా పండటాన ఊరికంతటికీ ధనవంతుడైపోయాడు. ధనంతోపాటూగా కాస్తంత గర్వమూ పెరగ సాగింది. అతడి భార్య భాగ్యం మాత్రం పొందికైన ఇల్లాలు, కల్లాకపటం ఎరుగదు. తమ పొలంలో పనిచేసే పాలేర్ల భార్యలను కూడా ఊరివారందిరితో పాటు పేరంటాలకు పిల్చి కాళ్ళకు పసుపురాసి తగిన వాయనాలు ఇచ్చి సమానంగా గౌరవించేది. ఆమెపై ఉండే గౌరవమూ, ప్రేమ కొద్దీ జంగయ్య  గర్వాన్ని, అహంకారాన్నీ అంతా భరించేవారు. జంగయ్య  కు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. అంతా భాగ్యమ్మ భక్తివల్లే అని అందరూ ఆమెను పొగిడారు. భాగ్యం ఊరు ఊరంతా పిలిచి పేరంటం చేసి అందరికీ రెవికెలగుడ్డలూ, పండ్లూ తీపులూ పంచిపెట్టింది. వాడికి సుయోధన్ అని పేరు పెట్టాడు జంగయ్య . "ఆ పేరెవ్వరూ పెట్టుకోరండీ! అది కౌరవుల పెద్దన్న, చెడులోనూ పెద్దన్న ఐన దుర్యోధనుడి పేరు” అని భార్య భాగ్యం మొత్తుకుంది. ఐనా రామయ్య వినక అదే పేరు పెట్టాడు. 'మనవాడు అందరిలోకీ ప్రత్యేకంగా ఉండాలి. వాడు ధనవంతుల బిడ్ద. వాడు నా కొడుకే!’ అని భార్య మాట పెడచెవిని పెట్టాడు.

జంగయ్య  మాత్రం కొడుకు పెరిగేకోద్దీ ఎవ్వరితో కలవనివ్వక తాము ధనికులమనీ అందరితో ఆటలాడవద్దనీ, చిన్నతనం నుంచే తన గర్వాన్ని కుల గౌరవంగా వాడికి ఎక్కించసాగాడు. తల్లి చెప్పేమాటలుకాక తండ్రి అహం వాడి వంట పట్టసాగింది. అంతా ఆడుకుంటుంటే వాడు దూరం నుంచీ చూసేవాడు. ఎవ్వరితోనూ కలవక తానేదో గొప్ప వాడినని ఎవరైనా పిలిచినా పలక్క భీష్మించుకు కూర్చునేవాడు. వాడి గర్వం అహంకారం చూసి అంతా తండ్రికి తగిన బిడ్డ అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు. వాడు స్కూల్లో చేరినా ఎవ్వరితో కలవక ఒక్కడే బెంచీ మీద ఒంటికాయ సొంఠి కొమ్ముల కూర్చునేవాడు. శూన్యమైన ప్రపంచ జ్ఞానంతో ఎలాగో వాడు ఏడోతరగతికి వచ్చాడు.

ఇలా ఉండగా ఒకమారు పిల్లలంతా విహార యాత్రలకెళుతుంటే వారితో కలవనియ్యక వేరే బస్సులో పంపాడు జంగయ్య . "ఒరే బిడ్డా! ఈ సొమ్ము నీ దగ్గర ఉంచుకో. బస్ లో కండక్టర్ 'టికెట్ టికెట్' అన్నప్పుడు సొమ్మిచ్చి టౌన్ కు టికెట్ కొట్టించుకో. బస్ దిగ్గానే రిక్షా చేసుకుని జ్యూకెళ్ళి చూసి, మళ్ళా అట్టాగే బస్ టికెట్ కొనుక్కుని ఇంటికిరా. మీ స్కూల్ వాళ్ళతో ఎవ్వరితోనూ కలవకు." అని చెప్పి కొడుకు సుయోధన్ ను బస్ ఎక్కించి పంపాడు జంగయ్య .

సుయోధన్ బస్సెక్కాడు. కండక్టర్ 'టికెట్ టికెట్ 'అనగానే పదిరూపాయలనోటిచ్చాడు. కండక్టర్ టికెట్ ఇచ్చాడు. బస్ బయల్దేరింది. పక్క ఊర్లో ఆగింది. చాలామంది జనమెక్కారు. మళ్ళా కండక్టర్ 'టికెట్ టికెట్' అని అరిచాడు. మళ్ళా పది నోటిచ్చాడు. ఇలా బస్ నిండా జనం ఎక్కడం దిగడం తో కండక్టర్ బిజీగా ఉంటూ 'టికెట్' అని అరిచినప్పుడల్లా సుయోధన్ పదినోటివ్వసాగాడు. కండక్టర్ టికెట్ ఇవ్వసాగాడు. మొత్తానికి టౌన్ చేరి రిక్షా ఎక్కాడు. రిక్షావాలా అందరి వద్దా పది తీసుకుంటే మనవాడి మెహంచూసి సుయోధన్ వద్ద ఇరవై తీసుకున్నాడు. మొత్తానికి జ్యూచేరి చూశాననిపించి, అమ్మ కట్టిచ్చిన క్యారేజీలో భోజనం తినేసి, తిరిగి రిక్షా ఎక్కి, బస్సెక్కి అడిగినప్పుడలా టికెట్ కు పదినోట్లిస్తూ ఊరు చేరాడు.

ఆ రోజు సాయంకాలం స్కూల్ మాస్టారు "మొత్తానికి మీవాడూ జ్యూ చూడను వచ్చినట్లున్నాడే?" అని పలకరించగా, పక్కనే ఉన్న సుయోధన్, జేబులోంచీ టిక్కెట్ల కట్ట తీసి చూపుతూ "అడిగినప్పుడల్లా టికెట్ తీసుకున్నాను మాస్టారూ" అన్నాడు ఏదో గొప్పలా. దానికి మాస్టారు వివరాలడిగి, ఆ టిక్కెట్లన్నీ చూసి పెద్దగా నవ్వి "ఓరే సుయోధనా! టికెట్ ఒక్కమారే కొనాలి, కొనని వారికోసం కండక్టర్ అలా అరుస్తుంటాడు. చూడు రంగయ్యా నీ కొడుకులాంటివాడే తల్లి అంగడికెళ్ళి అల్లం తెమ్మంటే 'అమ్మా! నా కెందుకు తెలీదూ అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట!' ప్రపంచజ్ఞానం లేకుండా ఎవ్వరితో కలవనివ్వక ఇలా పెంచితే ఎందుకూ పనికిరాడయ్యా! చదువు ప్రపంచ జ్ఞానాన్నివ్వాలి. అది అందరితో కలిసి తిరిగితే వస్తుంది కానీ 'నన్నుముట్టుకోకు నామాలకాకీ' అని పెంచితే నీ కొడుకెందుకూ పనికిరాడయ్యా" అని బుధ్ధి చెప్పాక నిజం తెల్సుకుని తాను మారి తన కొడుకునూ అందరితో కల్వనివ్వసాగాడు జంగయ్య .