Skip to main content
Latest News

జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే..

ఏపీలో రాజకీయంగా కలకలం రేపిన ‘కోడికత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు వైరల్ ఫీవర్ వచ్చింది. దీంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హాస్పిటల్‌లోని ఖైదీల వార్డులో డాక్టర్‌ నాయక్‌ పర్యవేక్షణలో శ్రీనివాస్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ అతనికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో అతనిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరిలో రిమాండుపై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తీసుకొచ్చి స్పెషల్ బ్లాక్‌లో ఉంచారు. 

గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై శ్రీనివాసరావు పదునైన కోడికత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. గొంతుపై గాయం చేయబోయాడనీ.. జగన్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అదికాస్తా భుజానికి గుచ్చుకుందని వైసీపీ నేతలు చెప్పారు. ఆ తర్వాత జగన్ నేరుగా విమానం ఎక్కి హైదరాబాద్‌‌కు వెళ్లడం.. ప్రభుత్వమే తనపై దాడి చేయించిందంటూ ఆరోపణలు చేయడంతో వివాదం కాస్తా.. రెండు పార్టీల మధ్య నలిగిపోయింది. ఈ కేసును తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించారు.