Skip to main content
Latest News

చంద్రబాబుకు పోలింగ్ రోజే తెలిసిపోయింది: విజయసాయి రెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా.. టీడీపీ అధినేత చంద్రబాబుపై రెచ్చిపోయారు.. పరుష పదజాలం వాడుతూ ఫైర్ అయ్యారు. ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీపై పోరాటం అంటూ వివిధ రాష్ట్రాలకు వెళ్తున్న చంద్రబాబు.. అక్కడ కూడా పాతపాటే పాడుతున్నారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వైసీపీకి డబ్బులు వచ్చాయనీ.. కట్టల కొద్దీ ఏపీకి డబ్బు మూటలు అందాయని చెబుతున్నారని తప్పుబట్టారు. అదే కనుక నిజం అయితే అప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేస్తోందని దుయ్యబట్టారు. పనిలో పనిగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లో నివసించకుండానే.. ఆ ఇంటికి అద్దె కట్టించుకున్నారంటూ ఆరోపించారు. ఆయన ట్విటర్లో చేసిన ట్వీట్లు యథాతథంగా..


‘బంజారాహిల్స్ రోడ్ నెం.7 లో నివసించకుండానే అద్దె కింద నెలకు రూ.లక్ష ప్రజాధనాన్ని బొక్కిన కోడెల ఆడబ్బును తిరిగి చెల్లించాలి. గవర్నర్ జోక్యం చేసుకుని తక్షణం విచారణకు ఆదేశించాలి. స్పీకర్ పదవిని ఇంతగా దిగజార్చిన వ్యక్తి దేశంలో ఇంకెక్కడా కనిపించడు. గుంటనక్కలు ఇకపై శాకాహారమే తింటామని శపథం చేసినట్టే ఉంది చంద్రబాబు, ఆయన పార్టీ పెద్దల వ్యవహారం. ఎన్నికల వ్యవస్థను నాశనం పట్టించిన వ్యక్తులు ఓటర్లు తెలివిమీరారని దుయ్యబడుతున్నారు. మద్యం ఏరులై పారించింది మీరే కదా? బ్యాంకుల నుంచి 2 వేల నోట్లు మాయం చేసింది ఎవరు? ఓటమికి కుంటి సాకులు వెతకడంలో తుప్పు కంటే కుల మీడియా జోరు ప్రదర్శిస్తోంది. వైఎస్పార్ కాంగ్రెస్ డబ్బు పంపిణీలో సక్సెస్ అయిందని చెత్త రాతలు మొదలు పెట్టింది. డబ్బు పంచలేక బాబు ఓడిపోతున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం. అసలు డబ్బులు వెదజెల్లే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే మీ జాతి రత్నం. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బతిమాలి మరీ చంద్రబాబు ఆహ్వానాలు తెప్పించుకుంటున్నారు.

టీడీపీ మాజీ రాజ్యసభ్యడొకరు డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ నాయకులతో ఫోన్లలో అదేపనిగా సంప్రదిస్తున్నారట. గతంలో తమ అధినేత నిధులు సమకూర్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. ఇమేజి పెంచే కసరత్తు. నలబై సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు యాంటెన్నాకు పోలింగ్ రోజే సిగ్నల్స్ అందాయి. అయినా 130, 150 అని బడాయికి  పోతున్నాడు. ఈవీఎంలపై దేశ వ్యాప్త ఉద్యమం బెడిసికొట్టిందో ఏమో? వైఎస్సార్ కాంగ్రెస్ హెలికాప్టర్లతో డబ్బులు వెదజల్లిందన్నట్టు కొత్త రాగం అందుకున్నాడు. చంద్రబాబును పిచ్చికుక్క కరిచినట్టు అనుమానం వస్తోంది. సోనియా ఏపీకి సమన్యాయం చేసిందంటున్నాడు. దెయ్యం అని ధూషించిన సోనియాను దేవతను చేశాడు. అడ్డగోలుగా విడగొట్టి కట్టుబట్టలతో పంపించారని గుడ్లురిమిన వ్యక్తి ఇప్పుడు విడదీసి మంచిపని చేశారంటున్నాడు. డాక్టరుకు చూపించండయ్యా. 2014-19 వరకు సిఎంగా ఉండటం మీ జీవితంలో బోనస్ పీరియడ్ అనుకోవాలి చంద్రబాబూ. గత ఎన్నికల్లో బీజేపీ మద్ధతు వల్ల 15 శాతం ఓట్లు అప్పనంగా పడి మ్యాజిక్ ఫిగర్ దాటావు. ఇప్పుడు పాల్ , పార్టనర్ ఏరు దాటిస్తారనుకున్నావు కాని అంచనా తప్పింది. మ్యానిప్యులేషన్లు అన్ని వేళలా పనిచేయవు కదా?..’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ల వర్షం కురిపించారు.