Latest News

ముగ్గురూ రండి..కొడంగల్ లో తేల్చుకుందాం: రేవంత్ రెడ్డి సవాల్

 
కొడంగల్ ప్రజల అండ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని, కోస్గి సభలో తన పేరు చెప్పదానికే భయపడ్డ కెసిఆర్ తననెం వోడిస్తారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కొడంగల్ మహాకుటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు.   పోలీసుల అదుపునించి విడుదల అయ్యాక జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..తెరాస రానున్న 48 గంటల్లో అరాచకాలు సృష్టించేందుకు కుట్ర చేస్తోందనీ, అందుకు తగ్గ సమాచారం తన దగ్గర ఉందనీ రేవంత్ అన్నారు. 

కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారనీ, ప్రలోభాలకు గురిచేసేందుకు రూ.100 నుంచి రూ.150 కోట్లతో ఇక్కడి ప్రజలపై కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారని అయన విమర్శించారు.  2009లో ఎంపీగా కేసీఆర్‌ గెలిచినప్పుడు ఇక్కడి ప్రజలే కీలక పాత్ర వహించారనీ, ఎంపీగా వున్నా, సీఎంగా వున్నా, ఏనాడూ కొడంగల్‌ ప్రజల బాగోగులు పట్టించుకోలేదనీ, రాష్ట్ర సమస్యలను నేను బలంగా ప్రస్తావిస్తున్నందుకు.. ఇక్కడి ప్రజలను కొనాలని గత ఏడాదిగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారనీ రేవంత్ విమర్శించారు.  ఎలాగైనా కొడంగల్‌లో గెలిచేందుకు కుట్రలు, కుతంత్రాలు చేశారనీ, ప్రజలు వాటిని తిప్పికొట్టడంతో పోలీసులతో మండల స్థాయి నాయకుల ఇళ్లపై దాడులు చేయించారనీ, ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ధర్నాలు చేశానని అయన అన్నారు.

తెల్లవారుజామున నా బెడ్‌రూంలోకి వచ్చి దౌర్జన్యంగా అరెస్ట్ చేసారనీ, ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేయడానికి ఎంతకైనా తెగిస్తారనడానికి ఇదే ఉదాహరణ అనీ, కొడంగల్‌లో గెలవాలంటే ప్రజల మనసు గెలవాలే తప్ప ఇలా దాడులు చేసి, ఇక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి కాదనీ రేవంత్ అన్నారు.  హరీశ్‌రావు, కేటీఆర్‌ కి చేత కాక పోవటం తో కేసీఆర్‌ రంగంలోకి దిగారనీ, ఇంకా ఎన్నికలకు 48 గంటల సమయం ఉందనీ, ముగ్గురూ రండి కొడంగల్‌ చౌరస్తాలో తేల్చుకుందాం అని సవాల్‌ విసిరారు రేవంత్.