Skip to main content
Latest News

ఏంటీ..? పవన్ స్టామినా.. మూడు నాలుగు సీట్లేనా..?

‘ఒకటి.. రెండు.. మూడు.. ఏదీ.. అంతకుమించి పెరగడం లేదేంటి..? వైసీపీకేమో కొన్ని సర్వేల్లో 135 సీట్లంటున్నారు.. టీడీపీకేమో మరికొన్ని సర్వేల్లో 110 సీట్లు అంటున్నారు. కానీ మాకు మాత్రం మూడు సీట్లే అని చెబుతున్నారేంటి..? అసలు మా పార్టీ అంటూ ఏపీలో ఉందని మర్చిపోయారా..? మా పార్టీని ఇంత తక్కువ అంచనా వేస్తున్నారేంటి..? ఇవి నిజమేనా..? అబద్దాలయితే బాగుండు..’.. ఇవీ ఆదివారం వెల్లడయిన ఎగ్జిట్ పోల్స్‌ను చూసిన జనసేన నేతల వ్యక్తిగత అభిప్రాయాలు. స్టార్ హీరో, సెలబ్రెటీ పవన్‌కల్యాణ్‌కు ఉన్న అట్రాక్షన్, బలమైన సామాజిక వర్గం, ఓటెత్తిన యువత.. ఇన్ని బలాలున్నా తమకు కేవలం 3 నుంచి 5 సీట్లే వస్తాయని అన్ని సర్వేల్లో ఒకే మాట వస్తుండటంపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తాము ఊహించింది ఒకటి.. సర్వేల్లో వెలువడింది మరొకటి అనే భావనలో ఉన్నాయి. జనసేన కేడర్‌ అయితే ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలైన తరువాత కొంత డీలా పడింది. 

కొన్ని సంస్థలు ఒక సీటుకు మించి రాదని, మరికొన్ని ఒకటి నుంచి ఐదు వరకు సీట్లు లభించే అవకాశాలు లేకపోలేదని అంచనా కట్టాయి. పోలింగ్‌ పూర్తయిన తరువాత జన సైనికులు మాత్రం తమ పార్టీకి కనీసం 15కు తగ్గకుండా లభించడం ఖాయమని, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేందుకైనా.. తమ పార్టీ మద్ధతు లేకుండా సాధ్యం కాదని గట్టి ధీమాతో వ్యవహరించారు. ఎగ్జిట్‌ ఫలితాల్లో ఎక్కడా జనసేన సీట్లు ఆ రూపంలో వస్తాయని పేర్కొనకపోవడం నిరాశే కలిగించింది. ఆఖరుకి కొన్ని జాతీయస్థాయి చానల్స్‌ వెలువరించిన ఫలితాల్లోనూ జనసేన ఖాతాలోకి ఒక సీటుకంటే మించి లభించకపోవచ్చని పేర్కొనడం గందరగోళానికి గురిచేసింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సోదిలో లేకుండా పోతున్న విషయం ఎగ్జిట్‌పోల్స్‌లో ధృవపడింది. సర్వే ఫలితాలపై కొందరు పెదవి విరిచారు. లోతట్టుగా తాము అంచనా వేశామని, ఓటర్లను నేరుగా కలుసుకుని అభిప్రాయం సేకరించామని, వీటికి భిన్నంగా అనేక సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు ఉన్నాయని, ఇవన్నీ వాస్తవికతకు దూరంగా ఉన్నాయంటూ పెదవి విరిచారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే రీతిలో సర్వే ఫలితాలు వెలువడినా.. దీనికి భిన్నంగా అప్పట్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.