Skip to main content
Latest News

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు రియాక్షన్

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు తీవ్ర గందరగోళానికి తెరలేపిన సంగతి తెలిసిందే. 900 మార్కులకు పైగా వచ్చి కూడా.. కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులను చూపించడంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఒకరిద్దరికి కాకుండా.. లక్షల సంఖ్యల్లో విద్యార్థులకు ఇదే రీతిలో కనిపించడంతో వారంతా తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఫెయిల్ అయ్యామన్న ఆందోళనతో ఏకంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల నిర్బంధం.. తల్లిదండ్రుల ఆక్రోశం.. విద్యార్థుల ఆగ్రహంతో.. తెలంగాణలో ఇదో బర్నింగ్ ఇష్యూలా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఎవరూ ఈ విషయంపై నోరు మెదపకపోవడం విచిత్ర పరిణామం. కాగా తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పరీక్షల్లో తప్పినంతమాత్రాన జీవితాలను అర్ధాంతరంగా ముగించడం సరికాదన్నారు. తల్లిదండ్రుల ఆశలను కడతేర్చకండంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ట్వీట్ చేశారు.. ఆ ట్వీట్ యథాతథంగా..

‘పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి మీరిచ్చే బహుమతి..’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.