Skip to main content
Latest News

అక్రమసంబంధం ఉందని అనుమానం.. భార్యను లారీ కింద తోసేసిన భర్త

భార్యపై అక్రమ సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్న  భర్త ఆమెను లారీ కిందకు తోసేసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మొగుడంపల్లి  మండలం మన్నాపూర్‌ గ్రామానికి చెందిన శంకర్‌కు నాగమణి(38)తో 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే ఇటీవలి కాలంలో గ్రామంలోనే ఇతర వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను వదిలించుకుందామని అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్‌తో కలిసి పథకం వేశాడు. పథకం ప్రకారం భార్యను వదిలించుకునేందుకు సోమవారం రాత్రి ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి దర్శనానికి ఆటోలో డ్రైవర్‌ హకీంతో కలిసి వచ్చారు.

సంగమేశ్వర స్వామిని దర్శించుకొని ఆటోలో తిరిగి వెళ్తుండగా కుప్పానగర్‌ శివారులోకి రాగానే టైర్ పంచర్ అయింది. ఇది శంకర్‌ హత్యా పతకానికి కలిసి వచ్చింది. ఆటోను వెనుకనుక నుంచి తోయాలని నాగరాణి, శంకర్‌కు ఆటో డ్రైవర్‌ సూచించాడు. ఆటోను తోస్తున్న క్రమంలో లారీ డ్రైవర్‌ ఝరాసంగం నుండి జహీరాబాద్‌ వైపు లారీని తీసుకువస్తున్నాడు. పథకం ప్రకారం వస్తున్న లారీ కిందికి శంకర్‌ నాగమణిని  తోసేశాడు. లారీ చక్రాలు ఆమె తలపై నుండి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు. ముందు రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించారు. కేసును ఛేదించే క్రమంలో రాములు, శంకర్‌, సతాంల కాల్‌ డేటాను పోలీసులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతురాలి తండ్రి శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాలవెల్లి, ఎస్‌ఐ ఏడుకొండలు వివరించారు.